Sunday, November 11, 2012

నారచనలు...



‘యానాం కథలు’
-దాట్ల దేవదానం రాజు,
పేజీలు: 168,
ధర: రూ.100,
ప్రతులకు: దాట్ల దేవదానం రాజు, 8-1-048,
ఉదయిని, జక్రియానగర్, యానాం- 533 464


మట్టికి ఉనికి ఉంటుంది... ఊపిరి ఉంటుంది. పరిస్థితుల రాపిడికి అందులోని రేణువుల్లో విస్ఫోటనం సంభవిస్తుంది. అప్పుడు తిరుగుబాట్లు జరుగుతాయి. వాటిని అణగదొక్కడానికి ఇనుపనాడాల బూట్లు కదం తొక్కుతాయి. విజయాలూ... వీర స్వర్గాలూ... తిరోగమనాలూ నమోదవుతాయి. మట్టిలో కలలుంటాయి..కలతలూ...కన్నీళ్లూ-ఇవన్నీ కలబోసిన జీవితాలూ ప్రతీ పొరలోనూ తారసిల్లుతాయి. మనిషీ మట్టీ వేరు కాదు. నిజానికి మనిషికి మట్టే వేరు! అందుకే మట్టి మూలాల్ని అనే్వషిస్తే కావలసినన్ని కథలు దొరుకుతాయి. చూడ్డానికి మట్టి ఒకేలా కనిపిస్తుందేమో గానీ మట్టి మట్టికీ తేడా ఉంది. దేని నేపథ్యం దానికి ఉంది. అందుకే మట్టిని ప్రేమించి..మట్టికి నమస్కరించి ఎవరు ఎన్ని కథలు రాసినా మనసు పెట్టి చదివే వారికి- ‘అమరావతి కథలు’, ‘్భట్టిప్రోలు కథలు’ లాగా దాట్ల దేవదానం రాజు గారి ‘యానాం కథలు’ కూడా తప్పకుండా నచ్చుతాయి.
భౌగోళికంగాను, భాష, యాస, సంస్కృతుల పరంగానూ యానాం గోదావరి మండలానికి చెందినట్లే కనిపించినా అది ఒకప్పటి ఫ్రెంచి వలస రాజ్యానికి చెందడం, నేటికీ కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగడం లాంటి కారణాలవల్ల ఆ మట్టిలో, మనుషుల జీవిత నేపథ్యాల్లో ఓ ప్రత్యేకత ఉట్టిపడుతుంది. అది సమూహంలోని ఏకాకితనం లాంటిది. దాన్ని సరిగ్గా ఒడిసిపట్టి కథలుగా ఆవిష్కరించడంలో దేవదానం రాజుగారి పనితనం ఈ సంపుటిలో కనిపిస్తుంది. ఏ ఊళ్లోనైనా జరగడానికి ఆస్కారమున్న కథలు అక్కడక్కడా కనిపించినా, కేవలం యానాం మాత్రమే నేపథ్యంగా ఉండితీరాల్సిన కథలు ఇందులో చాలా ఉన్నాయి. వలస రాజ్యంలో భాగంగా ఉన్నప్పటివి మొదలుకుని భారతదేశంలో విలీనం అయిన తర్వాతివి వరకు రకరకాల కథలిందులో ఉన్నాయి. అలాగే వర్తమాన పరిస్థితుల్లో కథను ఎత్తుకుని, గతంలోకి తీసుకువెళ్లినవీ, నాటి...ఈనాటి పరిస్థితుల మధ్య వైరుధ్యాల్నీ, డోలాయమాన స్థితినీ సాధికారికంగా చిత్రించినవీ చక్కని కథలున్నాయి.
ముఖ్యంగా ‘ఫ్రెంచ్ ఏలుబడి నేపథ్యంగా మలిచిన కథలైతే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘పతాక సందేశం’, ‘కథోర్ జియ్’, ‘తీర్పు వెనుక’, ‘లా’మూర్, ‘ఒప్సియం’ లాంటి కథలు చదువుతున్నప్పుడు మృణాల్‌సేన్, శ్యాంబెనగల్ లాంటి దర్శకుల చిత్రాల శైలి స్ఫురిస్తుంది. చరిత్రతో మొదలుపెట్టి, నడిమి కాలాన్ని దాటుకుని ఇప్పటి ఆక్వా కల్చర్ (‘నీలి వల’) వరకు రచయిత యానాంని 360 డిగ్రీల్లో సందర్శింప చేయడం ఈ సంపుటి తాలూకు ప్రత్యేకత. చాలా కథల్లో కవిత్వ శైలి అందంగా ఒదిగింది. (‘చిట్లిన దిగులు’ కథ పేరులోనే కవిత్వం ఉంది). చదువుతున్నంత సేపూ ఒక ప్రత్యేక పరిస్థితుల్లోకి తీసుకువెళ్లే ‘యానాం కథలు’ తప్పకుండా చదివిస్తాయి. రచయిత అభినందనీయుడు.


వలస రాజ్యంలో మొలిచిన గోదావరి నేపథ్యాలు (ఆంధ్రభూమి )
-ఓలేటి శ్రీనివాస భాను 23/12/2012





















యానాం  చరిత్ర



               











































































































































































































































































































































పాఠం పూర్తయ్యాక
(కవితా సంపుటి),
కవి- దాట్ల దేవదానంరాజు,
వెల: రు.60/-,
ప్రతులకు:
కవి పేర,
జక్రియానగర్,
యానాం- 533464


‘‘భాషకు గతుల్ని నేర్పి
కొత్త గొంతుకల్ని సృష్టించాడు
కొత్త లోకపు ద్వారాల్ని తెరిచి
మానవ గీతాల్ని ఆలపించాడు’’
- అతనే దాట్ల దేవదానంరాజు. కవిత్వం అతని శ్వాస. ఒక్కొక్క సంపుటికీ గుండె చప్పుళ్ళను చెక్కుకుంటు కవిత్వమై ప్రవహించే దాట్లవారి ఎనిమిదో కవితా సంపుటి ‘‘పాఠం పూర్తయ్యాక...’’ ఈ కవిత్వం చదివిన తర్వాత శిఖామణి అన్నట్టు- మట్టి మంచిగంధంలా పరిమళించటం, వెనె్నల చల్లగా మాట్లాడటం, ఎవరో వత్తిని ఎగదోసినట్టు మన యెదలోపలి దీపాలు వెలగడం... వంటి అనుభూతులు తప్పవు.
‘‘మొసలి కన్నీటి సానునయాల్నే
శ్వాసల్ని నులిమేసే నైరాశ్య తీరాల్నే దాటి
నేతన్నల చుట్టూ గీసిన చీకటి గీతల్ని చెరిపి
బతుకు భరోసా ఇవ్వాలి’’
అంటూ నేతన్నలపై రాజకీయాల దిగజారుడుతనాన్ని నిరసిస్తాడు. అంతేకాదు రైతన్నల పక్షాన గళమై గర్జిస్తాడు. దాట్ల రైతు మాత్రమేకాదు ఉపాధ్యాయుడు కూడా. గురువుగా గర్వించే కవి కాబట్టి
‘‘మట్టిని మంచి గంధం చేసే
సృజనాత్మక శ్రమ అది
ఒక్క ఉపాధ్యాయునికే
అబ్బిన విద్య అది’’
అనగలిగాడు. ఈయనకు అపూర్వమైన భావాలు వస్తాయి. వాటికి పదునుపెడుతి కవిత్వాన్ని చిలకరిస్తాడు. గొప్ప శైలిలా వుండదు కాని అక్షరాలను చెక్కటంలో నేర్పరి. గుండెను ఛిద్రంచేసే భావాలను కూడా సంయమనంతో శిల్పీకరించటం- మన గుండెల్ని ఆర్ద్రంచెయ్యటం రాజుగారి కవితా నిర్మాణ రహస్యం అనడానికి అనంతరం అనే కవిత మచ్చుతునక-
‘‘దుర్గుణావశేషాల్ని
కాసేపు మరచిపోవడమే
శవ సమయం...’’
అంటూ శవం జయం అంటాడు, మళ్ళీ అపజయం అంటాడు. శవ సందర్భంపై ఇలా రాసిన కవి మరొకరు లేరనుకుంటాను. దాట్లవారు పలు విధాలుగా ప్రతిస్పందిస్తారు. దానిని అక్షరాలతో కూరుస్తారు. శివారెడ్డి కవితకు ప్రతి కవిత రాయడం, యానాం గోదావరి ఒడ్డున నుంచున్న విదేశీ వనితపై రాయడం, క్రాప్ హాలిడే ప్రకటించిన రైతుక్షోభపై రాయడం, బాపుగారిపై రాయడం, జంతు ప్రేమికుడు జి.ఎన్.నాయుడు గారిపై రాయడం... నిదర్శనాలు. దాట్లవారి ఉపమానాలు సరికొత్తగా సందర్భోచితంగా ఉంటాయనడానికి ఉదాహరణలు:
‘‘రాటకు కట్టిన లేగ దూడల్లా’’
‘‘పాలిపోయి వెలిసిన రంగుల్లా’’
‘‘ఒత్తిడికి కందిపోయే పూలరేకుల్లా’’
‘‘దేవుని పటంలోని కాంతి వలయంలా’’
కవిత్వంలో పరిణతికెక్కిన దాట్లవారు ఎందువల్లనో కొన్నిటిని ఇంకా చెప్పవలసి వుందనిపించేలా సంక్షిప్తంగా ముగించడం గమనిస్తాం. దేవదానంరాజు కవిత్వంలో చదవడం మరపురాని అనుభూతి.

భావాలకు పదునుపెట్టిన కవిత్వం ( ఆంధ్ర భూమి)
-ద్వా.నా.శాస్ర్తీ 23/12/2012


దాట్ల దేవదానం రాజు రచించిన 'పాఠం పూర్తయ్యాక..' కవితా సంపుటిని  (8వ ది ) ప్రసిద్ధ కధకుడు పోరంకి దక్షిణామూర్తి ఆవిష్కరిస్తున్న దృశ్యం .
చిత్రంలో పి. చిరంజీవినీ కుమారి , గంటేడ గౌరునాయుడు, అదృష్ట దీపక్, గంటి భానుమతి, పి. సత్యవతి, వాడ్రేవు వీరలక్ష్మి దేవి వున్నారు.

కధాపఠనంలో దేవదానం రాజు








2 comments:

  1. నయనానంద కారకం మీ పని .. కొత్త కమలాకరం గారూ.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు.....కమలాకరం

      Delete